ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి

  • ఇది హత్య అంటూ మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి తన తల్లిదండ్రుల ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులే ఆమెను హత్య చేసినట్టు యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం… చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీలో ముంతాజ్‌, షౌకత్‌ అలీ కుటుంబం నివాసం ఉంటోంది. ఆర్‌ఎంపి డాక్టరైన అలీ…. చిత్తూరు రూరల్‌ మండలం తుమ్మెదపాలెంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె యాస్మిన్‌ (26). ఎస్‌వి సెట్‌ కాలేజీలో ఎంబిఎ పూర్తి చేశారు. ఫిబ్రవరి 6న ఇంటి నుండి వెళ్లిపోయి యాస్మిన్‌ తన ఎంబిఎ క్లాస్‌మేటైన పూతలపట్టు మండలం పోర్టుకనుమ గ్రామానికి చెందిన సాయితేజను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యాస్మిన్‌, సాయితేజ కలిసి అదే గ్రామంలో ఉంటున్నారు. తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు సోమవారం ఉదయం వారి ఇంటికి వెళ్లిన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. షౌకత్‌ అలీ తన కుమార్తె యాస్మిన్‌ను బాలాజీ కాలనీలోని తన ఇంటికి తీసుకొచ్చి తమ పరువు తీసేశావంటూ నానా బూతులు తిట్టారు. యాస్మిన్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మతి చెంది ఉండడాన్ని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గుర్తించామంటూ ఆమె తల్లిదండ్రులు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, చంపేసి ఆత్మహత్యగా తన అత్తమామలు చిత్రీకరిస్తున్నారని యాస్మిన్‌ భర్త సాయితేజ ఆరోపిస్తున్నారు.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మృతిపై స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. యాస్మిన్‌ను ఆమె తండ్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళ్తునప్పుడు తాను అక్కడే ఉన్నానని, తాను తర్వాత వస్తానని తన భార్యతో చెప్పానని, ఆ తర్వాత ఈ ఘోరం జరిగిందని సాయితేజ వాపోయారు. ఇరుపక్షాల ఫిర్యాదులను పోలీసులు నమోదు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️