అప్పుడు మీరేంచేశారు..?

  • మద్యం అవినీతి నిగ్గుతేలుస్తాం : మంత్రి రవీంద్ర

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అధికారంలో ఉండగా మీరేమి చేశారో గుర్తులేదా, వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎంత మందిపై తప్పుడు కేసులు పెట్టారో.. మర్చిపోయారా అని వైసిపి నేతలను ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రూరల్‌ మండలం సోములదొడ్డి, సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఎక్సైజ్‌ డిపోల నూతన భవనాలను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి… పోలీసుల బట్టలూడదీస్తామన్న వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవన్నారు. వారి హయాంలో పోలీసులను ఏ రకంగా ఉపయోగించుకున్నారో గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన వారికి ఉద్యోగోన్నతులు, మున్సిపల్‌ చైౖర్మన్‌ పదవి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఇక్కడ ఒక్క ఘటన జరిగితే దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసిపి హయాంలో మద్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల వరకు డిజిటల్‌ లావాదేవీల్లేకుండా చెల్లింపులు జరిగాయని చెప్పారు. ఈ అవినీతిని నిగ్గుతేల్చే పనిలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ మద్యాన్ని అరికట్టామని చెప్పారు. ప్రభుత్వం ఆదాయం పెరిగే విధంగా అన్ని రకాల చర్యలూ తీసుకున్నట్టు వివరించారు.

➡️