‘వారి’ స్థానంలో నూతన డిఎస్‌పిల నియామకం

May 21,2024 08:14 #AP Police Department, #postings
  • పలువురు ఇతర పోలీస్‌ అధికారులు కూడా

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల్లో వేటుపడ్డ డిఎస్‌పిల స్థానంలో నూతన డిఎస్‌పిలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎన్నికల సంఘం నుండి అందిన ఆదేశాల మేరకు ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నర్సారావు పేట డిఎస్‌పిగా ఎం. సుధాకర్‌ రావును నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా దిశా డిఎస్‌పిగా పనిచేస్తున్నారు. అలాగే గురజాల డిఎస్‌పిగా సిహెచ్‌ శ్రీనివాసరావును నియమించింది. ఈయన ప్రస్తుతం కాకినాడ ఎస్‌సి,ఎస్‌టి సెల్‌ డిఎస్‌పిగా పని చేస్తున్నారు. తిరుపతి డిఎస్‌పిగా కె.రవిమనోహర ఆచారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈయన ఎసిబి డిఎస్‌పిగా పనిచేస్తున్నారు. అలాగే మరో ఎసిడి డిఎస్‌పి ఎం. వెంకటాద్రిని తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పిగా నియమించారు. ఏలూరు ఎస్‌ఈబి డిఎస్‌బిగా విధులు నిర్వర్తిస్తున్న కె. జానార్థన నాయుడును అనంతపురం జిల్లా తాడిపత్రి డిఎస్‌పిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు శ్రీసత్యసాయి జిల్లాలో విఆర్‌లో లో ఉన్న ఎం.రామారావును అలిపిరి సిఐగా, అనంతపురం విఆర్‌లో ఉన్న ఎ.విశ్వనాథ్‌ చౌదరిని తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బి) సిఐగా, తాడిపత్రి సిఐగా పి.నాగేంద్రప్రసాద్‌ను నియమించారు. పల్నాడు స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐలుగా బండారు సురేష్‌బాబు, యు.శోభన్‌బాబు, కారెంపూడి ఎస్‌ఐగా కె. అమీర్‌, నాగార్జున సాగర్‌ ఎస్‌ఐగా ఎం. పట్టాభిని నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.

➡️