రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మూడు ఇండిస్టియల్‌ కారిడార్ల ఏర్పాటుకు ఎపి ఇండిస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎపిఐసిడిఎ) అంగీకారం తెలిపింది. ఎపిఐసిడిఎ చైర్మన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం తొలిసారి బుధవారం సచివాలయంలో జరిగింది. వైజాగ్‌ చైన్నె ఇండిస్టియల్‌ కారిడార్‌ (విసిఐసి) (కృష్ణపట్నం నోడ్‌) పరిధిలో 10,834.50 ఎకరాలు, చెన్నై బెంగళూరు ఇండిస్టియల్‌్‌ కారిడార్‌ (సిబిఐసి) ( ఓర్వకల్‌ నోడ్‌) పరిధిలో 9,718.84 ఎకరాలు, హైదరాబాద్‌ బెంగళూరు ఇండిస్టియల్‌ కారిడార్‌ (హెచ్‌బిఐసి) ‘కొప్పర్తినోడ్‌ 6740.44 ఎకరాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మూడు కారిడార్లకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్లను కూడా బోర్డు అంగీకరించింది. ఈ కారిడార్ల పరిధిలోని ఇండిస్టియల్‌, రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలని తెలిపింది. వీటిని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఎపిఐసిడిఎ, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ, టౌన్‌ ప్లానింగ్‌, కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక, పారిశ్రామిక శాఖల మంత్రులు పయ్యావుల కేశవ్‌, టిజి భరత్‌,ఇంధన శాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె విజయానంద్‌, ఆర్‌పి సిసోడియా, మున్సిపల్‌, పరిశ్రమల ముఖ్యకార్యదర్శులు ఎకె సింఘాల్‌, కె సునీత తదితరులు పాల్గొన్నారు.

➡️