- మరమ్మతులు చేసిన ఎస్‌ఆర్‌బిసి అధికారులు
ప్రజాశక్తి – అవుకు (నంద్యాల) : నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కట్టకు రంధ్రం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. రిజర్వాయర్ 4.15 టిఎంసిల కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 4.15 టిఎంసిల నిల్వ ఉందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ నుంచి గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్) కాలువకు పదివేల క్యూసెక్కులు, ఎస్‌ఆర్‌బిసి కాలువకు 270 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని శ్రీశైలం రైట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఆర్‌బిసి) డిఇ కొండన్న తెలిపారు. మంత్రి బిసి జనార్థన్ ఆదేశాల మేరకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని పూడ్చారు. మట్టితో పూడ్చడం వలన రిజర్వాయర్ కట్ట పటిష్టంగా ఉంటుందా? లేదా? అన్న సందేహం రిజర్వాయర్ దిగువ ప్రాంతాలైన చెన్నంపల్లి, ఓబులాపురం, శివవరం, చిన్న కొట్టాల, అవుకు, అన్నవరం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
ఎటువంటి ప్రమాదమూ లేదు : డిఇ కొండన్న
రివిట్‌మెంట్‌పై ఉన్న రాళ్లు కొంతమేర కదిలాయని, వాటి వలన ఎటువంటి ప్రమాదమూ ఉండదని ఎస్‌ఆర్‌బిసి డిఇ కొండన్న తెలిపారు. ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రంధ్రం పడిన ప్రాంతాన్ని వెంటనే మట్టితో కప్పివేశామన్నారు. రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని కొంతమేర తగ్గిస్తున్నామని తెలిపారు.