పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఇక్కట్లు

May 12,2024 21:47 #Election Staff, #lunch, #morning, #Tiffin

– భోజనంలేక ఇబ్బందులు
– సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం
ప్రజాశక్తి-యంత్రాంగం:ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో ఆదివారం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎండ తీవ్రత వల్ల నెల్లిమర్లలో ఒక పోలింగ్‌ ఆఫీసర్‌, జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కళాశాల కేంద్రంలో ఒక ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. వారిని 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. నెల్లిమర్ల నుంచి భోగాపురం మండల కేంద్రానికి సిబ్బంది వెళ్తున్న బస్సు విజయనగరంలో రెండు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో వేరే బస్సు కోసం సిబ్బంది వేచి ఉండాల్సి వచ్చింది. బబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో 1700 మంది సిబ్బందికి రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల భోజనాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సామగ్రి తీసుకునేందుకు సుమారు 1500 మంది సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. వారికి సరైన భోజన ఏర్పాట్లు చేయకపోవడంలో అధికారులు విఫలమయ్యారు. మధ్యాహ్నం 12:30లకే భోజనాలు అయిపోవడంతో సిబ్బంది అసంతృస్తి వ్యక్తం చేశారు. భోజనం ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌ మాత్రం తమకు తక్కువ సంఖ్య చెప్పారని, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి భోజనం చేశారని, అందుకే కూరలు సరిపోలేదని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారిగానీ, ఇతర సిబ్బందిగానీ అటువైపు రాకపోవడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో సరైన భోజనం అందకపోవడంతో పోలింగ్‌ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో సిబ్బంది క్యూ లైన్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. మరోసారి భోజనం రప్పించి అరకొరగా వడ్డించారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు.

➡️