- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
- ఐదేళ్లలో రాజధాని కట్టలేని వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా !
- సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
ప్రజాశక్తి – మల్లు స్వరాజ్యం ప్రాంగణం (నెల్లూరు) : విజన్ల పేరుతో రాష్ట్ర అభివృద్ధి జరగదని, గతంలో విజన్ 2020 అని ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు కొత్తగా 2047 ఎత్తుకున్నారని, ఇవన్నీ కార్పొరేట్లకు దోచిపెట్టేందుకేనని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా నెల్లూరులోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం (విఆర్ కళాశాల గ్రౌండు)లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని అన్నారు. తరువాతైనా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, ఇక పెట్టుబడులు ఏం తీసుకువస్తారని ప్రశ్నించారు. ఐదేళ్లు సిఎంగా ఉండి రాజధాని నిర్మించలేని వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడంలో అర్థం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందని, ఐదేళ్లు సింగపూర్ జపం చేసి అమరావతిని జగన్‌కు అప్పగిస్తే, ఆయన మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడని అన్నారు. మరోవైపు వెనుకబడిన ప్రాంతాలకు తాగేందుకు నీరు కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తే లక్షలమంది ప్రజలకు తాగునీరు వస్తుందని, దానికి రూ.2000 కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే అభివృద్ధి పెద్దల కోసమేనని, ప్రజల అభివృద్ధి కాదని అన్నారు. పోర్టుల పేరుతో, పరిశ్రమల పేరుతో నెల్లూరు జిల్లాలోనే వేల ఎకరాలు తీసుకుంటున్నారని, వాటిని ఇచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా భూములిచ్చిన దళితులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా బెదిరించి లాక్కుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతాలకు తాగేందుకు నీరు ఇవ్వలేకపోయారని, ఈ జిల్లా నుండి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు గతంలోనూ ప్రభుత్వాల్లో ఉన్నారని, ఇన్నేళ్లలో ఎందుకు నీటిని సరఫరా చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. వారు చెప్పే అబద్ధాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో జరిగిన సిపిఎం 27వ మహాసభ ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు కార్యాచరణ రూపొందించిందని అన్నారు. ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ బాధలు ఉంటే అక్కడ సిపిఎం ఉంటుందని ఆయన తెలిపారు.