రాజకీయ ముసుగులో నేరాలను సహించం

  • హోమ్‌శాఖ పద్దుపై చర్చలో సిఎం చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజకీయ ముసుగులో నేరాలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హోమ్‌శాఖ పద్దుపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం శక్తియాప్‌ తెచ్చినట్లు చెప్పారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్‌ ఆర్డర్‌ ముఖ్యమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హయంలో భాధ్యత కలిగిన ప్రతిపక్షంగా టిడిపి ఆందోళన చేస్తే తమ కార్యాలయంపైనే దాడికి దిగారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యాలయమంటే దేవాలయమని, గతంలో ఎక్కడా పార్టీ ఆఫీసులపై దాడులు జరిగిన ఘటనలు లేవని అన్నారు. రాజకీయ కక్షసాధింపులకు తాను దూరంగా ఉంటానని చెప్పారు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్‌ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. స్వార్థం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో గంజాయి పండించేందుకు వీల్లేదన్నారు. గంజాయి సాగుచేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని, తమ పిల్లలు ఎలా ఉంటున్నారో తల్లిదండ్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు.

పిచ్చిరాతలు రాస్తే అంతే సంగతులు

గత పాలకులు రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారారని, సోషల్‌ మీడియా ముసుగులో రోత పుట్టించే రాతలు రాశారని తెలిపారు, మహిళలపై వ్యక్తిగత దూషణలు చేసి ఆడబిడ్డలు తలెత్తుకుని తిరగలేని విధంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా పిచ్చి రాతలు రాస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఠా నాయకులు, రౌడీ అనేమాట వినబడకూడదని గతంలో మెసేజ్‌ ఇచ్చి ఆచరణలో చూపించానని, ఇప్పుడూ అదే చేస్తామని అన్నారు.

22ఏ ఉపయోగించి భూ దందాలు

ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిషేధ కింద కొత్తచట్టం తీసుకొస్తున్నామని, గత పాలకులు చేసిన భూ మాఫియా అంతా ఇంత కాదని తెలిపారు. 22ఏ ఉపయోగించి భూదందాలు చేశారని, రికార్డులు తారుమారు చేస్తూ ప్రభుత్వ, పేదల, ఫారెస్ట్‌ భూములు కొట్టేశారని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం తీసుకువస్తున్నామని, ఎవరైనా భూ కబ్జాకు పాల్పడాలంటే భయపడే విధంగా ఉంటుందని తెలిపారు.

వివేకా కేసులో సాక్షుల మరణంపై ఆందోళన

సంచలనం కలిగించిన వివేకానంద రెడ్డి హత్య కేసు తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోందని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారని, దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2019లో వివేకా హత్య జరిగిన సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు మెసేజ్‌ వచ్చిందని, ఎన్నికల హడావుడిలో అదే నిజమనుకున్నామని అన్నారు. నేరస్తులు ఏ విధంగా ట్రాప్‌లో వేస్తారో ఇదోక ఉదాహరణని, మధ్యాహ్నం బాడీ పోస్టుమార్టం చేయాలని ఆయన కూతురు సునీత అడగకపోయి ఉంటే నిజం సమాధయ్యేదని అన్నారు. అప్పటి వరకూ గుండెపోటు అని ప్రచారం చేసిన టివి ఛానల్‌ పోస్టుమార్టం తరువాత మాట మార్చిందని చెప్పారు. నారాసుర రక్తచరిత్ర అంటూ విష ప్రచారం చేశారని తెలిపారు. ఇలాంటి అరాచకాలు చేసి కూడా నేడు రాజకీయాలు చేస్తున్నారని, తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా హత్యా రాజకీయాలు మరక అంటకుండా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకోవచ్చనుకుంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వవని హెచ్చరించారు.

➡️