అవి ఆదాయ పాలసీలు

  • అమలు చేసి తీరాలి : సిఎం చంద్రబాబు
  • అధికారుల గందరగోళ సమాధానాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పాలసీలను క్ష్తేత్రస్థాయిలో అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు ప్రారంభ కార్యక్రమం అనంతరం బుధవారం ఆయన వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలసీలను ప్రస్తావించిన ఆయన అవి ఆదాయ మార్గాలకు కొత్త రూపం ఇస్తాయని తెలిపారు. వాటి అమలుతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, అమల్లో జాప్యం జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు కొందరు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. కొందరు తడబాటుకు గురయ్యారు. దీంతో సిఎం కొంత అసహనం వ్యక్తం చేశారు. అస్పష్టతతో సమావేశాలకు రావొద్దని, ఖచ్చితమైన సమాచారంతో రావాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంతోపాటు, దానికి అవసరమైన ప్రణాళికలు ఎలా అమలు చేయాలనే అంశంపై సిఎం పలు సూచనలు చేశారు.

ఉచిత సిలిండర్లు, ఐదు కిలోల సిలిండర్లకు సంబంధించి సిఎం అడిగిన ప్రశ్నకు సంబంధిత అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అక్కడే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ సిఎంకు సమర్పించారు. అధికారులు వరుస తడబాట్లతో సిఎం కొంత అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పూర్తిగా మారాలని, ప్రభుత్వం నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. రెండోసారి జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఎక్కువమంది అధికారులు సరైన సమాచారం లేకుండానే రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండోరోజు సమావేశాల్లో అయినా సరైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు.

50 లక్షల మంది సమాచారం లేదు

రాష్ట్రంలో 50 లక్షలమంది సమాచారం ప్రభుత్వం వద్ద లేదని అధికారులు తెలిపారు. 5.4 కోట్ల మంది జనాభా ఉంటే 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పురపాలక, రెవెన్యూ, రవాణా, విద్యుత్‌, పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో వీరి సమాచారం లేదని తెలిపారు. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టి జనవరి 31లోపు అన్ని వివరాలూ సమర్పించాలని సిఎం అన్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో పౌరుల వివరాలను అనుసంధానించాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్‌ చేయాలని, గ్రామాలు రిహాబిలిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్‌ చేయాలని సిఎం సూచించారు.

ఎఐ కాదు డీప్‌టెక్‌

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకూ ఎఐ గురించి మాట్లాడుతున్నామని, ఇక నుండి డీప్‌టెక్‌ గురించి మాట్లాడుకోవాలని తెలిపారు. గూగుల్‌ లాంటి సంస్థలు వస్తే అది పెద్ద పనికాదని వివరించారు.

➡️