- ‘ట్రూఅప్’ భారాన్ని ఖండించిన పిసిసి చీఫ్ షర్మిల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సర్దుబాటు ఛార్జీల విషయంలో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సిందిపోయి, కూటమి ప్రభుత్వం ఆ పాప పరిహారాన్ని ప్రజల నెత్తిన మోపుతోందని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లు సర్ధుబాటు ఛార్జీలు వినియోగదారుల నెత్తిన వేయడం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న భారీ ‘కరెంట్ షాక్’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. ఐదేళ్లలో వైసిపి రూ.35 వేల కోట్లు భారం వేస్తే, ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.18 వేల కోట్ల భారం వేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి సర్దుబాటు ఛార్జీల భారం వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా గురువారం నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు.
సర్దుపోటు : కె రామకృష్ణ
రెండేళ్ల కాలానికి సంబంధించి విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.17 వేల కోట్లు భారం వేయడం దుర్మార్గమైన చర్యగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి సర్ధుబాటు ఛార్జీలు రూ.6,072 కోట్లు వసూలు అమల్లోకి రాకుండానే 2023-24 ఏడాదికి మరో రూ.11 వేలకోట్లు సర్దుబాటు భారం మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీ ల భారం వేయబోమన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించి వ్యవహరిస్తోం దన్నారు. ఈ భారాలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 7న విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్ష పార్టీల సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యమం ఉంటుందన్నారు.