- డల్లాస్ ఇన్వెస్టర్స్ మీట్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ, ఎన్‌ఆర్‌ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డల్లాస్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెట్టుబడుల కోసం త్వరలోనే ప్రభుత్వం ఆధ్వర్యాన ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వివరించారు. దీనికోసం ఎన్‌ఆర్‌ఐలు తగిన ప్రతిపాదనలతో రావాలన్నారు. వారికి కావాల్సిన అన్ని రకాల అనుమతులూ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఔత్సాహిక పెట్టుబడిదారులు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగే రోజులకు ఈ ప్రభుత్వంలో కాలం చెల్లిందని తెలిపారు. యాప్‌లో పెట్టుబడిదారులు రిజిస్టరయితే అధికారులే నేరుగా అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని మంత్రి సూచించారు. రాష్ట్రంలో సంవత్సరానికి 50 వేల మంది విద్యార్థులకు చివరి సెమిస్టర్ నుండి ఐటి శిక్షణ కూడా అందివ్వబోతున్నామని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. ఇందుకోసం ఐబిఎం ఇతర ఐటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కెపాసిటీ బిల్డింగ్ సెంటర్లు పెడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐ టిడిపి కన్వీనర్ కోమటి జయరాం అధ్యక్షత వహించారు.