డిప్యూటీ సిఎం పేషీకి బెదిరింపు కాల్స్‌

  • రంగంలోకి పోలీస్‌శాఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ పేషీకి సోమవారం బెదిరింపు కాల్స్‌ రావడంతో అగంతుకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ చేయడం, ఆ క్రమంలో అభ్యంతరకరమైర భాషతో హెచ్చరిస్తూ అగంతకుడు మెసేజ్‌లు పెట్టినట్లు కార్యాలయ సిబ్బంది డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పేషీ అధికారులు బెదిరింపు కాల్స్‌ విషయాన్ని డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలివెళ్తున్న విషయంపై డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ సీరియస్‌గా దృష్టిసారించడం, ప్రభుత్వం సిబిసిఐడికి ఈ కేసు విషయం ఇవ్వడంలో పవన్‌ కీలకపాత్ర పోషించారు. బియ్యం మాఫియా ఏమైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ పేషీకి అగంతుకుడి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చిన మాట నిజమేనని జనసేన పార్టీ కార్యాలయం ధ్రువీకరించింది. ఇదే తరహాలో హోంమంత్రి వంగలపూడి అనితకు రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిసింది.

➡️