ప్రజాశక్తి – యంత్రాంగం : ఎండ వేడిమి, వడగాలులకు తాళలేక ఆదివారం ముగ్గురు మృతి చెందారు. ఎన్‌టిఆర్ జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన గంగదారి సుబ్బారావు (65) వ్యవసాయ పనులతోపాటు పశుపోషణ చేసుకునే జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరే గేదెలను మేపడం కోసం పొలాలకు వెళ్లారు. ఎండకు తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చి నీరసంతో కూలబడిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎన్‌టిఆర్ జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామానికి చెందిన కోటా సుశీలమ్మ (80) తీవ్ర వడగాల్పులకు మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన మేలుగులూరి స్వరాజ్యం (65) ఎండలకు తాళలేక తీవ్ర అస్వస్థతతో మృతి చెందారు.
