ముగ్గురు చిన్నారులు మృతి

May 17,2024 08:23 #3 death, #Tirupati district
  •  చెరువులో కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదం

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ దర్శనం కోసం చెరువులో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శ్రీబొమ్మరాజపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి డాక్టర్‌ పి.బాబు, విజయ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉషిక (17), చరిత (14), రిషిక (10) ఉన్నారు. ఉషిక ఇంటర్‌ పూర్తి చేశారు. చరిత తొమ్మిదో తరగతి, రిషక ఐదో తరగతి చదువుతున్నారు. గురువారం సాయంకాలం గ్రామంలోని దేవాలయ దర్శనానికి తమ తల్లి విజయతో కలిసి ముగ్గురు చిన్నారులు వెళ్లారు. కాళ్లు శుభ్రం చేసుకునేందుకు గుడి సమీపంలోని చెరువు వద్దకు చిన్నారులు వెళ్లారు. కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవ శాత్తు కాలు జారి ఒకరి తర్వాత మరొకరు చెరువులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరుకోలేక ఊపిరాడక ముగ్గురు చనిపోయారు. ఎంతసేపటికి పిల్లలు రాకపోవడంతో గుడి వద్ద విజయ..చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో పడి చిన్నారులు మునిగిపోయిన విషయాన్ని గమనించి గ్రామస్తులకు విషయం చెప్పారు. ముగ్గురు చిన్నారులను వారు ఒడ్డుకు చేర్చి పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️