ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం తిరుపతి జిల్లాలో 41.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 41.5, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో 40.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనట్లు తెలిపారు. మంగళవారం 209 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని వివరించారు. ఇందులో 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీచే పరిస్థితి వుందని తెలిపారు. బుధవారం నాటికి మరింత పెరిగే అవకాశం వుందని, మొత్తం 342 మండలాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం వుందని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో 22 మండలాల్లో, విజయనగరంలో 27, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, విశాఖలో 6, అనకాపల్లిలో 20, కాకినాడలో 18, అంబేద్కర్ కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 18, పశ్చిమగోదావరిలో 4, ఏలూరులో 7, కృష్ణాలో 2, బాపట్లలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం వుందని తెలిపారు.
