- పొగమంచుతో అదుపుతప్పిన వాహనం
- తల్లి, ఇద్దరు కుమారులు మృతి
ప్రజాశక్తి -పి.గన్నవరం (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొగమంచు అధికంగా ఉండడంతో అదుపుతప్పి పంట కాలువలోకి కారు దూసుకెళ్లడంతో తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి విజరుకుమార్, తన భార్య ఉమ, కుమారులు మనోజ్, రిషిలతో కలిసి ఆదివారం విశాఖ జిల్లా అరకుకు కారులో విహార యాత్రకు వెళ్లారు. అనంతరం తిరిగి మంగళవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారి పేటకు వచ్చే సరికి పొగమంచు ఎక్కువగా ఉండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు గల్లంతయ్యారు. విజరుకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. ఒడ్డుపైకి వచ్చి కేకలు వేయగా స్థానికులు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కారుకు కొంత దూరంలోనే ఉమ (34), మనోజ్ (9), రిషి (7) మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు ప్రమాద ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని తెలిపారు.