Vzm – ‘గోస్తనీ’లో ముగ్గురు విద్యార్థుల మృతి

ప్రజాశక్తి – జామి (విజయనగరం) :విజయనగరం జిల్లా జామి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోస్తనీ నదిలో ముగ్గురు యువకులు మృతి చెందారు. నదిలో మునిగిపోతున్న యువకుడిని రక్షించేందుకు ఒకరి తర్వాత మరొకరు ఇలా మృత్యువాతపడ్డారు. పోలీసుల కథనం మేరకు..విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వద్ద గోస్తనీ నదిపై చిన్న వాటర్‌ ఫాల్స్‌ ఉంది. దీన్ని చూసేందుకు విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు మంగళవారం వచ్చారు. నదిలో దిగి స్నానం చేస్తుండగా జి. అనిల్‌ (14) మునిగిపోయారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మహ్మద్‌ అస్రిఫ్‌ (17) గల్లంతయ్యారు. వీరిద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించిన షాకిబ్‌ఖాన్‌ (16) కూడా నదిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మిగతా విద్యార్థులు స్థానికులకు సమాచారమిచ్చారు. స్థానిక ఎస్‌ఐ వీరబాబు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి వచ్చిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు గాలించి ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️