రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

  • మరో 11 మందికి గాయాలు
  • వారిలో ఇద్దరి పరిస్థితి విషమం

ప్రజాశక్తి – పరిగి : ఆటోను గుర్తు తెలియని వాహనం ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం సమీపంలో కొడికొండ చెక్‌ పోస్ట్‌- సిరా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం దొడగట్టకు చెందిన పద్నాలుగు మంది హిందూపురం సమీపంలోని కొట్టి చౌడేశ్వరి దేవస్థానంలో శనివారం రాత్రి భజన చేసి ఆదివారం తెల్లవారుజామున తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. పరిగి మండలం ధనాపురం సమీపంలోని జాతీయ రహదారి 544లో వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢకొీంది. ఈ ప్రమాదంలో దొడగట్టగ్రామానికి చెందిన అలివేలమ్మ (45), ఆదిలక్ష్మమ్మ (65), సాకమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. విజరు, సుజాత, అభి, బబ్లు, ప్రమీలమ్మ, అంజిరెడ్డి, రూప, యశ్వంత్‌ కుమార్‌, అంజినమ్మ, ఆటోబాబు, పాపమ్మ గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. స్వల్పగాయాలయిన ఇద్దరిని ఇంటికి పంపించారు. మిగిలిన ఏడుగురికి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ రంగడుయాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గురైన వారందరూ వ్యవసాయమే జీవనోపాధిగా కూలి పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కోరారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని హిందూపురం పార్లమెంటు సభ్యులు బికె పార్థసారథి, హిందూపురం మున్సిపల్‌ చైౖర్మన్‌ డిఇ రమేష్‌ తదితర నాయకులు పరామర్శించారు.

➡️