- కోర్టు ఆదేశాలనూ అమలు చేయని రెవెన్యూ అధికారులు
- దోసపాడు భూపోరాటంపై పి.రామకృష్ణ
ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడులో సుమారు వందెకరాలకుపైగా అసైన్డ్ భూముల కోసం అక్కడి పేదలు, దళితులు పెద్దఎత్తున పోరు సాగిస్తున్నారు. క్షేత్రస్థాయి పోరుతోపాటు కోర్టుల్లో కేసులు వేసి పేదలు అనుకూల ఉత్తర్వులు సాధించుకున్నా… రెవెన్యూ అధికారులు అమలు చేయని పరిస్థితి. ఈ భూపోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తున్న వ్యవసాయ కార్మిక రంగం నేత పి.రామకృష్ణ నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయనను ప్రజాశక్తి పలుకరించగా దోసపాడు పోరాట పూర్వపరాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. దోసపాడులోని సీలింగ్ భూములను 1956 నుంచి 98 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు సుమారు 106 ఎకరాలు పేదలకు అసైన్ చేసి డి.నమూనా పట్టాలిచ్చాయి. ఇవికాక సీలింగ్ భూమి 350 ఎకరాలు, గయాళ భూములు సుమారు 150 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. నేటికీ ఈ భూములన్నీ విజయవాడకు చెందిన భూస్వాముల సాగులో ఉన్నాయి. అక్రమంగా రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. అన్యాక్రాంత భూములను గుర్తించిన రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉదాశీనత ప్రదర్శించడంతో పేదలు నష్టపోతున్నారు. 106.16 ఎకరాల అసైన్డ్ భూములను అర్హులైన తమకే అందించాలని అక్కడి పేదలు, దళితులు పోరాడుతుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సుమారు 95 మందిపై 8 కేసులు నమోదయ్యాయి. ఈ పేదల పోరాటానికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వాన దోసపాడు నుంచి ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వరకూ పాదయాత్ర సైతం నిర్వహించారు. పేదలను పోరులో ముందుండి నడిపిస్తున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఎ.రవి, ప్రజాసంఘాల జిల్లా నేతలు డిఎన్‌విడి. ప్రసాద్, కె.శ్రీనివాస్‌లపైనా పోలీసులు కేసులు బనాయించారు. క్షేత్రస్థాయి పోరుతోపాటు 2012 నవంబర్‌లో లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం 2015 ఆగస్టులో పేదలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను అప్పటి రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో పేదలు పోరు సాగించాల్సి వచ్చింది. ఇదే క్రమంలో 2023లో జిల్లా కోర్టులో, జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో కేసులు నడపగా అక్కడా పేదలకు అనుకూలంగా తీర్పులొచ్చినా, నేటికీ అమలు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు తీర్పులను అమలు చేయాలని సిసిఎల్‌ఎను కలిశాం. అసైన్డ్ భూమిని పేదలకు అప్పగించాలని, సాగుకు అవకాశం కల్పించాలని రానున్న కాలంలో పోరు ఉధృతం చేయనున్నాం.