త్రిఫ్ట్‌ ఫండ్‌ బకాయిలు విడుదల చేయాలి

  • మంత్రి సవితకు ఎపి చేనేత కార్మిక సంఘం వినతి

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ (గుంటూరు జిల్లా) : టిడిపి కూటమి ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో చేనేతకు త్రిఫ్ట్‌ ఫండ్‌ కింద కేటాయించిన రూ.5 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్‌లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవితను ఆదివారం సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. గత నిధులను విడుదల చేయకపోగా 2025-26 బడ్జెట్లోనూ రూ.5 కోట్లు కేటాయించినట్లు శాసన మండలిలో మంత్రి చెప్పారని గుర్తు చేశారు. చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు విడుదల చేయాలన్నారు. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన యారన్‌, పావలా వడ్డీ రిబేటు కింద ఇవ్వాల్సిన రూ.156 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని కోరారు. నాబార్డ్‌కు వడ్డీలు కట్టలేక సహకార సంఘాలు దివాళా తీస్తున్నాయన్నారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు మార్గదర్శకాలను విడుదల చేయాలని, 30 శాతం రిబేటును ఏడాది మొత్తం కొనసాగించాలని, మగ్గం వేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ‘నేతన్న నేస్తం’ ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రయివేట్‌ సెక్టార్‌లో చేనేత కార్మికులకు త్రిఫ్ట్‌ అమలు జరపాలని, పట్టు, జరీ నూలు ధరలను 2021 నాటి ధరలకు తగ్గించాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, సహకార సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ రద్దు చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.శివదుర్గారావు, కార్యదర్శి డి.రామారావు, కె.వెంకటేశ్వరరావు ఉన్నారు.

➡️