ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేసే రిసోర్స్ పర్సన్ (ఆర్‌పి)లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడేళ్ల కాలపరిమితి జిఓను రద్దు చేయాలని ఎపి మెప్మా ఆర్‌పి (పట్టణ రిసోర్స్ పర్సన్) ఉద్యోగుల సంఘం (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆర్‌పిలకు కాలపరిమితి జిఓను రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీని, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల నుండి ఆర్‌పిలు విజయవాడలోని ధర్నా చౌక్‌లో జరిగిన ధర్నాకు సోమవారం పెద్దయెత్తున హాజరయ్యారు. ఈ ధర్నానుద్దేశించి ధనలక్ష్మి మాట్లాడుతూ.. మెప్మాలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న 8,500 మంది ఆర్‌పిలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితి జిఓను కుట్రపూరితంగా విడుదల చేసిందని విమర్శించారు. 8,500 ఆర్‌పిలను అకారణంగా తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణం కాలపరిమితి జిఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగులైన ఆర్‌పిలను అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆర్‌పిలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో ఓ కార్పొరేటర్ ఏకంగా ఆర్‌పిల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్‌పిలకు ఇచ్చేది తక్కువ వేతనమైనా ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో చాలా మందికి రూ.ఐదు వేలకు మించి వేతనం రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సభలకు, కార్యక్రమాలకు మహిళలను తరలించేందుకు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే ఆర్‌పిలకు లాగిన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. ధర్నా అనంతరం తాడేపల్లిలోని మెప్మా కార్యాలయంలో మెప్మా ఎమ్‌డి నాగలక్ష్మి, డైరెక్టరు ఆదినారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆర్‌పిల సమస్యలను వివరించారు. ఆర్‌పిలందరికీ రూ.8 వేల వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్‌ఎల్‌ఎఫ్ నుంచి రూ.2 వేలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రూప్ ఇన్సూరెన్స్‌పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు, నాయకులు శాంతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
