ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌తో సకాలంలో పరిశ్రమల ఏర్పాటు

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌ అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల పర్యవేక్షణ అంశాలపై సకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కొన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారి లేరని, కాబట్టి ఆ జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ నోడల్‌ అధికారిగా సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ యూనిట్లు ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహం ఎగుమతుల కమిటీ ముందుంచి సకాలంలో ఆయా పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమ ఏర్పాటులో డిపిఆర్‌ స్థాయి నుంచి యూనిట్‌ గ్రౌండింగ్‌ అయ్యే వరకూ నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఎస్‌ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్‌ మెకానిజమ్‌ కింద ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ ట్రాకర్‌ ఒక సమర్ధవంతమైన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అని చెప్పారు. రాష్ట్రంలో వివిధ విభాగాల ద్వారా ఏర్పాటవుతున్న ప్రాజెక్టులను ట్రాక్‌ చేయడం అడ్డంకులుంటే వాటిని సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రాజెక్టు స్థితిని నిరంతరం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశ్రమ కేంద్రాల ప్రాజెక్టు సమాచారం, నవీకరింపజేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఐఅండ్‌ఐ, ఐటి అండ్‌ సి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నెడ్‌క్యాప్‌ తదితర 14 విభాగాలకు చెందిన లైన్‌ డిపార్టుమెంట్లు ఈ ట్రాకర్‌ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించి ఎస్‌ఐపిబి ఆమోదం పొందాక సకాలంలో ఆయా యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతివారం దీనిపై నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు డాష్‌ బోర్డును మానిటర్‌ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, జెన్‌కో, నెడ్‌క్యాప్‌ ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌బాబు, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️