– ఆ తర్వాతే పోలవరం నిర్మాణం చేపట్టాలి
– మరో పోరాటానికి నిర్వాసితులు సిద్ధం కావాలి
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
– పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్ర
ప్రజాశక్తి – ఎటపాక/కూనవరం/చింతూరు విలేకరులు (అల్లూరి జిల్లా) : కాంటూరుతో సంబంధం లేకుండా పోలవరం నిర్వాసితులందరికీ ఒకే దశలో పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన గురువారం ఎటపాక, కూనవరం, చింతూరు మండలాల్లోని పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. తొలుత ఎటపాక మండలంలోని వీరాయిగూడెం, మురుమూరు గ్రామాల్లో యాత్ర సాగింది. అనంతరం ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ‘ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు మొదటగా మా గ్రామం ముంపునకు గురవుతోంది. 40 అడుగుల వరదకే గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. అయినా మా గ్రామాన్ని ముంపు లెక్కల్లోకి తీసుకోలేదు’ అని వీరాయిగూడెంకు చెందిన మహిళ కొరసా లక్ష్మి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాత లెక్కల ప్రకారం నిర్వాసిత గ్రామాల జాబితాను ప్రభుత్వం తయారు చేసిందని, వాస్తవ లెక్కల్లో అంతకు రెట్టింపు వరద ముంపు ప్రభావం గ్రామాల్లో ఉంటోందని తెలిపారు. నిర్వాసితుల తరపున సిపిఎం పోరాటం ప్రారంభించాక మరో 30 గ్రామాలను 41.15 కాంటూరు జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2022 గోదావరి వరద ముంపును ప్రామాణికంగా తీసుకొని పోలవరం ముంపు గ్రామాల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాల్సి ఉండగా… పది సంవత్సరాల క్రితం ప్రకటించిన పరిహారాన్నే నేటికీ ఇస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కాంట్రాక్టర్లకు ఎటువంటి నష్టమూ కలగకుండా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు పెంచినప్పుడు నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఎందుకు పెంచరని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం పని చేస్తుందా ? అని ప్రశ్నించారు. అనంతరం కూనవరంలోని గిన్నెల బజార్‌లో పర్యటించారు. పోలవరం వల్ల ప్రతి ఏడాదీ ముంపు బారిన పడి నరక యాతన పడుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. 2022 గోదావరి వరదల్లో సర్వం కోల్పోయామని తెలిపారు. ఇటీవల తమ గ్రామంలో ఇళ్ల సర్వే చేపట్టి అంచనా వేసి రూ.7.50 లక్షలు వస్తాయని చెప్పారని, కానీ రూ.13 లక్షలు వచ్చినా ఇప్పుడు ఇల్లు కట్టలేమని ఓ మహిళ తన బాధను చెప్పుకొచ్చారు. చింతూరు మండలంలో శ్రీనివాసరావు పర్యటించినప్పుడు ముకునూరు గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. గత వరదల్లో గ్రామం మొత్తం ముంపునకు గురైందని, పడవలు కూడా నడిచాయని, అయినప్పటికీ కొన్ని ఇళ్లనే ముంపు జాబితాలో చేర్చారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఊరంతా మునిగిపోతున్నా గ్రామంలో 121 గృహాలు ముంపులో ఉన్నట్లు జాబితాలో ప్రకటించి, 49 గృహాలను ముంపులో లేనట్లుగా అధికారులు చూపడం దారుణమన్నారు. నిర్వాసిత గ్రామాల్లో జరిగిన ప్రజా చైతన్యయాత్రల్లో పార్టీ ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, పల్లపు వెంకట్, సున్నం రాజులు పాల్గన్నారు.
బాధితులను ముంచి ప్రాజెక్టు కడతామంటే ఊరుకోం
కూనవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ ఎర్రజెండా పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితులను గోదావరిలో ముంచి పోలవరం ప్రాజెక్టు కడతామంటే సిపిఎం చూస్తూ ఊరుకోదన్నారు. పరిహారం, పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడు రెట్లు మొత్తం ఇవ్వాల్సి ఉందన్నారు. మునక మండలాలలో మూడు వేల మందిని జాబితా నుంచి తొలగించారని తెలిపారు. తాజాగా సర్వే జరిపి ప్రతి నిర్వాసితునికీ పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిర్వాసితుల పక్షాన పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నామని హెచ్చరించారు. ముంపు మండలాల ప్రజలు మరో ఉధృత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.