నేడు పోలవరం, 1న బాపట్లలో సిఎం పర్యటన

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, చిన్నగంజాం : ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పరిశీలించనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ ఒకటిన బాపట్ల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. గురువారం ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.45 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌కు చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్ట్‌ వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్ట్‌ నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తారు. 3.10 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌లోని హెలిప్యాడ్‌కు వచ్చి తాడేపల్లికి చేరుకుంటారు. బాపట్ల జిల్లా పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో ఏప్రిల్‌ ఒకటిన సిఎం పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం, గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, అడిషనల్‌ ఎస్‌పి విఠలేశ్వరరావుతో కలిసి సిఎం టూర్‌ కో-ఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేష్‌ బుధవారం పరిశీలించారు.

➡️