- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అత్యవసర పరిస్థితుల్లో సంసిద్ధతపై మంగళవారం, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మాక్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆందోదన చెందొద్దని, అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమని అన్నారు. మంగళవారం నాడు విజయనగరం, ఏలూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో, బుధవారం నాడు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణతో సంబంధం ఉన్న అన్ని విభాగాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన కార్యకలాపాలతో సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్‌టిఆర్, బాపట్ల, కర్నూలు, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో మాక్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించినట్లు వెల్లడించారు.