నేడు సీతారాముల కల్యాణం

  • పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి

ప్రజాశక్తి – ఒంటిమిట్ట : శ్రీసీతారామ కల్యాణోత్సవానికి ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శుక్రవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య నిర్వహించనున్న ఈ వేడుకను వీక్షించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాలన్నీ విద్యుత్‌ దీపాలతో కళకళలాడుతున్నాయి. కల్యాణోత్సవ ఏర్పాట్లపై టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామన్నారు. తలంబ్రాల పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి ఒక్కరికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు.

మోహినీ రూపంలో శ్రీరాముడు

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాములవారిని మోహినీ రూపంలో అలంకరించారు. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.

➡️