ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలు : డిప్యూటీ సిఎం పవన్‌

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి) : బాలీవుడ్‌ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువతో రాకెట్‌ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలని రాష్ట్ర డిప్యూటీ సిఎం కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో అంతరిక్ష దినోత్సవ వేడుకలను మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవానికి తనని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని, శాస్త్రవేత్తలపై తనకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారని కొనియాడారు. ఒకే వ్యామనౌక ద్వారా 108 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడం అంటే మాటలు కాదని, అది మన శాస్త్రవేత్తలకే సాధ్యమైందని పేర్కొన్నారు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోగాలు చేయడం ఇస్రోకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ రఘురాం, అసోసియేట్‌ డైరెక్టర్‌ సయ్యద్‌, షార్‌ కంట్రోలర్‌ శ్రీనివాసులు రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వేయాలి…
బెంగళూరు నుండి ఉపగ్రహాలను తీసుకొచ్చే మార్గంలోని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీనివల్ల ఇబ్బంది కలుగుతోందని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి శాస్త్రవే త్తలు తీసుకెళ్లారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి కలెక్టర్‌తో మాట్లాడారు. బుచ్చినాయుడు కండ్రిక నుంచి మన్నారు, పోలూరు వరకు శ్రీ కాళహస్తి రోడ్డును 17 కిలోమీటర్ల మేర యుద్ధ ప్రాతిపదికన వేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే సమకూరుస్తానన్నారు.

➡️