ఆవిర్భావ సభకు హాజరు కానున్న పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి – పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ సభను ‘జయకేతనం’ పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు. సభ ప్రాంగణం, వేదికను జనసేన జెండాలతో తీర్చిదిద్దారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు మెడికల్ క్యాంపులు, 14 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. జయకేతనం సభకు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. 1,600 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నారు. 75 సిసి కెమెరాలను, ఎల్‌ఇడి స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
