- మొత్తం 81.14శాతం మంది పాస్
- గతేడాదితో పోల్చితే తగ్గిన ఉత్తీర్ణత
- మన్యం ఫస్ట్, అల్లూరి లాస్ట్
- మే 19 నుంచి సప్లమెంటరీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలురు కంటే 5.78శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి-2025 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా బుధవారం విడుదల చేశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేది వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,19,286 మంది దరఖాస్తు చేసుకోగా 6,14,459 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో 4,98,585(81.14శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.బాలికలు 3,01,202 మంది హాజరవ్వగా, 253,278(84.09శాతం0 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,13,257 మంది హాజరవ్వగా 2,45,307(78.31శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 5.55శాతం తగ్గింది. గత సంవత్సరం 86.69శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 11,819 మంది పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవ్వగా, 1680 పాఠశాలల్లో 100శాతం, 19 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యాయి. 95.55 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానం సాధించగా, 50.73శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. యాజమాన్యం వారీగా ఎపి రెసిడెన్షియల్ 95.02శాతంతో తొలిస్థానం కైవసం చేసుకున్నాయి. ఆ తరువాత 95శాతంతో బిసి సంక్షేమ పాఠశాలలు రెండో స్థానంలో నిలిచాయి. హాజరైన వారిలో 65.36శాతం మంది మొదటి క్లాస్‌లో పాసయ్యారు. రెండో లాంగ్వేజ్‌లో అత్యధికంగా 99.51శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా మ్యాథ్స్‌లో 86.92శాతం సాదించారు. హిందీ మీడియంలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో 58.59శాతం, ఇంగ్లీష్‌లో 83.15శాతం, ఉర్దూలో 70.71శాతం, కన్నడలో 58.25శాతం, తమిళంలో 77.08శాతం, ఒడియాలో 90.23శాతం చొప్పున పాసయ్యారు. సబ్జెక్టు వారీ మెమోరాండం షీట్లు నాలుగు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పాఠశాలల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉండటంతో కొంతమంది ఫలితాలను విడుదల చేయలేదు.
సప్లమెంటరీ పరీక్షలు
సప్లమెంటరీ పరీక్షలు మే 19వ తేది నుంచి 28వ తేది వరకు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఈ నెల 24 నుంచి 30వ తేది వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుంతో మే 18వ తేది వరకు చెల్లించే అవకాశం ఉంది. ప్రశ్న పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 24వ తేది ఉదయం 10 నుంచి మే 1వ తేది ఉదయం 11 గంటల వరకు షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రీ కౌంటింగ్ కోసం రూ.500లు, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000లు చొప్పున చెల్లించాలని తెలిపారు.
ఫలితాలను https://results.bse.ap.gov.in/ https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా పొందొచ్చు. ‘మన మిత్ర’ వాట్సప్ యాప్, లీప్ మొబైల్ యాప్‌లలోనూ ఫలితాలు అందుబాటు ఉన్నాయి.