- డాక్‌యార్డ్ గేటు వద్ద ఉద్యోగులు, మహిళల ఆందోళన
ప్రజాశక్తి -ములగాడ (విశాఖపట్నం) : డాక్‌యార్డ్ వద్ద ఎస్‌బిసి వంతెనపై రాకపోకలకు అనుమతి వ్వాలంటూ కుటుంబాలతో కలిసి డాక్‌యార్డు ఉద్యోగులు సోమవారం డాక్‌యార్డ్ గేటు వద్ద భారీ ఆందోళన చేపట్టారు. డాక్‌యార్డ్ వంతెనను మరమ్మతు పనులు నిమిత్తం రెండు నెలలుగా రాకపోకలు నిలిపివేశారని, కానీ పనులు మాత్రం ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు వేరే మార్గంలో రావాలంటే తమకు ఉద్యోగులకు భద్రత లేకుండా ఉందని, పక్కనే ఉన్న ఎస్‌బిసి వంతెనపై రాకపోకలకు అనుమతివ్వాలని నినదించారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి నగరంలోకి వెళ్లాలన్నా, నగరం నుంచి పారిశ్రామిక ప్రాంతానికి రావాలన్నా ఈ వంతెన మీదుగా రాకపోకలకు సౌకర్యంగా ఉండేదని ఉద్యోగులు తెలిపారు.
ఈ వంతెన మూసివేయడం వల్ల చుట్టూ తిరిగి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా డాక్‌యార్డ్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. ఒకవైపు రహదారిలో గోతులు, మరోవైపు భారీ వాహనాల రాకపోకలతో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో తాము ప్రయాణిస్తున్నామని వాపోతున్నారు. ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబాలతో కలిసి ఆందోళన చేసినా యాజమాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంస్థలోకి వెళ్లే ఉద్యోగులను సైతం నిలిపివేసేలా ఉద్యమానికి నిర్ణయం తీసుకుంటామన్నారు.