తీవ్ర విషాదం – కారు డోర్‌లాకయ్యి ఊపిరాడక చిన్నారి మృతి..!

May 22,2024 13:17 #car, #child died, #tragedy

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి… కారు డోర్‌ లాక్‌ కావడంతో ఊపిరాడక తుదిశ్వాస విడిచింది. కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఆపిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్‌ లాక్‌ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకపోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కల్నిషా కనిపించింది. వెంటనే కారు డోర్స్‌ ఓపెన్‌ చేసి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న మూడేళ్ళ కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి, లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తూ మఅతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

➡️