- సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
ప్రజాశక్తి -ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా) : సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన కథనం ప్రకారం.. కనుమ పండుగ సందర్భంగా పర్యాటక కేంద్రమైన రేవుపోలవరం తీరప్రాంతానికి జనం పోటెత్తారు. కాకినాడ జిల్లా తుని మండలం, లోవకొత్తూరు గ్రామస్తులు రేవుపోలవరం తీరానికి వచ్చారు. వారిలో సముద్ర స్నానానికి దిగిన పనసబోయిన సాధ్విక్ (10) మునిగిపోతుండగా రక్షించేందుకు కాకర మణికంఠ (20) వెళ్లారు. అలల ఉధృతికి మణికంఠ కూడా మునిగిపోయారు. కొద్దిసేపటికి సాధ్విక్ అలల మధ్య కనిపించడంతో స్థానిక మత్స్యకార యువకులు వెళ్లి బయటకు తీసుకొచ్చారు. రేవుపోలవరంలో గల్లంతైన మణికంఠ మృతదేహం గురువారం నక్కపల్లి మండలం చినతినార్ల సముద్ర తీరంలో లభ్యమైనట్లు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు.