చేప ప్రసాదం పంపిణీలో విషాదం – తోపులాటలో వ్యక్తి మృతి

తెలంగాణ : ప్రతి సంవత్సరం బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తారు. ఇక ఈ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో జనాలు చేప ప్రసాదం కోసం పోటెత్తారు. అయితే ఆస్తమా బాధితులకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నిర్వహిస్తున్న చేపమందు పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. చేప ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తిన క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నిజామాబాద్‌ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన 57 సంవత్సరాల రాజన్న స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్‌ లో నిలుచున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా రద్దీ పెరిగి జరిగిన తోపులాటలో స్పృహ కోల్పోయారు. వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం కేర్‌ ఆస్పత్రికి తరలించారు. రాజన్న కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాజన్న కుటుంబంలో చేప ప్రసాదం పంపిణీ విషాదం నింపింది.

➡️