భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక మహిళ ఆత్మహత్య
ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకుంది. పందెం కోడిని ఈత కోసం పోలవరం కాలువకు రెండు రోజుల క్రితం తీసుకెళ్లిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు కుమారులు మణికంఠ, సాయికుమార్ ప్రమాదశాత్తు ఆ కాల్వలో పడిపోవడం మృతి చెందడం, వారిని రక్షించేందుకు కాల్వలోకి దూకిన వెంకటేశ్వరరావు కూడా మరణించడం తెలిసింది. దీంతో, ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి వెంకటేశ్వరరావు భార్య శెట్టిపల్లి దేవి (38) అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇంటి వద్ద మరుగుదొడ్డిలో ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకున్నారు. మరుగుదొడ్డి లోపలికి వెళ్లిన దేవి ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి బంధువులు వెళ్లి చూశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పెదవేగి ఎస్‌ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలోని నలుగురూ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.