తిరుపతిలో విషాదం

  • వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి
  • మరో 14 మందికి చికిత్స
  • మానసిక వికలాంగుల కేంద్రంలో ఘటన

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వాంతులు విరేచనాలతో మానసిక వికలాంగుల కేంద్రంలో ఇద్దరు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు. వికలాంగుల కేంద్రం నిర్వాహకుల కథనం మేరకు…తిరుపతి రూరల్‌ మండలం పద్మావతిపురం పంచాయతీలో ‘పాస్‌’ మానసిక వికలాంగుల కేంద్రాన్ని గత 26 సంవత్సరాలుగా మురళీకృష్ణ నిర్వహిస్తున్నారు. 72 మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. గత శుక్రవారం రాత్రి పిల్లలందరికి బోండాలు వడ్డించారు. శని వారం సాయంత్రం ఇద్దరికి వాంతులు  కావడంతో స్థానికంగా వైద్యం అందించారు. మరుసటి రోజు మరో ఇద్దరికి వాంతులు కావడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని తిరిగి పంపించారు. సోమవారం ఉదయం మరో ఇద్దరికి వాంతులు, విరేచనాలు కావడంతో వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గణపతి (35) మృతి చెందారు. మంగళవారం ఉదయం మరో 15 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శేషాచలం (16) మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి రూరల్‌ తహశీల్దారు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. అధికారుల ముందే వాంతులు చేసుకున్న ఏ.ఈశ్వర్‌రెడ్డి, ఎ.తేజు, అనిత, ఎస్‌.హుమన్‌ హుస్సేన్‌, పండు, సాయికిట్టు, తేజా, మోగిలిలను రుయా ఆస్పత్రికి తరలించారు. నీటిని, ఆహారాన్ని పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపారు.

➡️