- ఇద్దరు చిన్నారులతో కలిసి కాలువలో దూకిన తల్లి
- నాలుగు నెలల చిన్నారి మృతి
ప్రజాశక్తి-విజయవాడ : ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన రెండేళ్ల పాప, నాలుగు నెలల చిన్నారితో కలిసి బందరు కాలువలోకి దూకింది. ఈ సంఘటన రామలింగేశ్వర్‌నగర్ స్క్రూబ్రిడ్జీ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు నెలల పసికందు మృతి చెందగా తల్లి, మరో పాప గల్లంతయ్యారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు శారదా నగర్‌కు చెందిన సుధారాణి, ఆమె భర్త తిరుపతిరావు మధ్య తరుచూ కుటుంబ కలహాలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా భర్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో విజయవాడ కృష్ణలంకలోని కళానగర్ రెండో లైనులో నివాసముంటున్న తిరుపతిరావు అన్నయ్య కోటేశ్వరరావు ఇంటికి పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఆదివారం ఉదయం వచ్చారు. మధ్యాహ్నం వరకు అందరూ ఇంటి వద్దనే ఉన్నారు. సుధారాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి స్క్రూబ్రిడ్జీ పైనుంచి కాలువలో దూకింది. కాలువ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో తల్లితోపాటు పెద్ద పాప గల్లంతు కాగా, చిన్నారి మృతదేహం బయటపడింది. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు వాయిదా వేశారు. తిరుపతిరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పటమట సిఐ పవన్‌కిషోర్ తెలిపారు.