విశాఖ, నర్సీపట్నంలో విషాదం

Jan 9,2025 21:18 #narsipatnam, #tragedy, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో విశాఖ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జివిఎంసి 55వ వార్డు పరిధి కంచరపాలెం ఇందిరానగర్‌-5కు చెందిన సుమారు 15 మంది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లారు. బుధవారం జరిగిన తొక్కిసలాటలో కండిపల్లి శాంతి (35) మృతి చెందారు. ఆమె భర్త వెంకటేష్‌ కంచరపాలెం మెట్ట వద్ద ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. జివిఎంసి 43వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య స్వాతి (38) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆమె భర్త సతీష్‌ విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌లో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్దిలపాలెం రామాలయం ప్రాంతానికి చెందిన జి.రజిని (47) మృతి చెందారు. ఆమె భర్త జి.లక్ష్మణ రెడ్డి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలు రజిని, ఆమె భర్త, కుమారుడితో కలిసి మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి తిరుమల వెళ్లారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన బొడ్డేటి నాయుడుబాబు (55) బీరువాల షాపులో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం చెట్టుపల్లి గ్రామానికి చెందిన అతని స్నేహితుడు, భార్య మణికుమారితో కలిసి వెళ్లినట్లు బంధువులు తెలిపారు.

➡️