- మినీ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఇద్దరు మృతి
- 26 మందికి గాయాలు
ప్రజాశక్తి – ప్రత్తిపాడు (కాకినాడ జిల్లా) : విహార యాత్రలో విషాదం చోటు చేసకుంది. మినీ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఇద్దరు మృతి చెందగా 26 మందికి గాయాలైన సంఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి వద్ద గురువారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన కోమాకుల శ్రీనివాసరావుకు ముగ్గురు కుమార్తెలు వరలక్ష్మి, శిరీష, అంజలి ఉన్నారు. ముగ్గురు కుమార్తెలు తమ భర్తలు, పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చారు. పండుగ అనంతరం అందరూ కలిసి ఓ మినీ వ్యాన్‌లో దారపల్లి జలపాతానికి బయలుదేరారు. ఒమ్మంగి గోపాలుడు చెరువు మలుపు వద్దకు వచ్చేసరికి వ్యాను అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యానులో ఉన్న శ్రీనివాసరావు భార్య చంద్రావతి (45), బంధువు బత్తిన లక్ష్మి సురేఖ (19) అక్కడికక్కడే మృతి చెందారు. వాహన డ్రైవర్ డొక్కాడ రాంబాబుతోపాటు 26 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని కాకినాడలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. ప్రత్తిపాడు ఎస్‌ఐ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.