ఒరాకిల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒరాకిల్ సంస్థతో సోమవారం ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రతినిధులు ఎంఒయుపై సంతకాలు చేశారు. ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్ట్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభించనుంది. మహిళలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్ధేశం.
తొలి ఏడాది లక్ష మంది, రెండు, మూడు సంవత్సరాల్లో లక్షన్నర మంది చొప్పున మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్సియల్స్, ఒసిఐ ఫౌండేషన్స్, ఎఐ ఫౌండేషన్స్, డేటాసైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్‌పాత్స్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్‌డేటెడ్ వెర్షన్స్‌లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌ల కోసం లెర్నింగ్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్‌వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అందించే ఎస్‌డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్ధేశించిన అర్హతా ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎమ్‌డి అండ్ సిఇఒ గణేష్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్‌కుమార్, ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్రకుమార్, సీనియర్ సేల్స్ డైరెక్టర్ దేబప్రియనందన్, వైస్ ప్రెసిడెంట్ (జపాక్ స్కిల్ డెవలప్‌మెంట్) తపస్‌రారు, టెరిటరీ సేల్స్ మేనేజరు షకీల్ అహ్మద్ మొహ్మద్, ప్రిన్సిపల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ వెంకట శివ నక్కా, కంట్రీ హెడ్ అశ్లేష ఖండే పార్కర్ పాల్గొన్నారు.
