ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పారదర్శకంగా బదిలీలను నిర్వహించనున్నట్లు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రక్రియను పారదర్శకంగా, పక్షపాత రహితంగా నిర్వహించాలని ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు. శాసనసభ సమావేశాల్లో, మంత్రి మండలి సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేస్తుందని సిఎం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,500కోట్లు ఉపాధి హామీ నిధులను వంద రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం రాబట్టగలిగిందన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,987 కోట్లు వచ్చాయని, 2027 నాటికి జల్‌జీవన్ మిషన్‌ద్వారా రూ.95.44 లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా రక్షిత నీరు నిరంతరాయంగా సరఫరా చేయాలనేది తమ లక్ష్యమని తెలిపారు. గ్రామ స్ధాయిలో మౌలిక వసతుల కల్పన, స్ధానిక పాలనలో ప్రజా భాగస్వామ్యం థ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ఇందుకు ఉద్యోగుల శక్తికి ప్రోత్సాహాన్ని అందించాలన్నారు.