ఒడిశాకు తరలుతున్న తాబేళ్లు పట్టివేత

Jun 15,2024 22:35 #Odisha, #Trapping, #turtles migrating

ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి జిల్లా) :ఒడిశాకు కారులో అక్రమంగా తరలిస్తున్న 397 తాబేళ్లను అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం సుద్దగొమ్మి గ్రామం వద్ద అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను రంపచోడవరంలోని వన్యప్రాణి సంరక్షణ విభాగానికి చెందిన కార్యాలయం వద్ద డిఎఫ్‌ఒ నరేంద్రన్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. రామచంద్రాపురం నుంచి ఒడిశాకు తాబేళ్లు అక్రమ రవాణా అవుతున్నాయన్న పక్కా సమాచారంతో పోక్స్‌పేట చెక్‌పోస్ట్‌ వద్ద అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ కారు ఆగకుండా వేగంగా వెళ్లడంతో అధికారులు దాన్ని వెంబడించారు. సుద్దగొమ్మి సమీపంలో కారును విడిచి నిందితులు పరారయ్యారు. ఆ కారులో సుమారు 13 గోనె సంచులలో 397 తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని రంపచోడవరంలోని వన్యప్రాణి విభాగం కార్యాలయానికి తీసుకొచ్చారు. వాటిలో 30 తాబేళ్లు అప్పటికే చనిపోయాయి. మిగిలిన వాటిని పాపికొండలు అభయారణ్యంలోని సురక్షిత ప్రాంతానికి తరలించి విడిచిపెట్టనున్నట్లు డిఎఫ్‌ఒ నరేంద్రన్‌ తెలిపారు. ఈ తాబేళ్లను ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలోని ప్రజలు అధికంగా తింటారని, వాటిని తినడం వల్ల కొన్ని రకాల రోగాలు నయమవుతాయనే అపోహ వారిలో ఉందని, అందుకే ఆ ప్రాంతంలో వీటికి డిమాండ్‌ ఎక్కువని తెలిపారు. అపోహలను ఎవ్వరూ నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రామారావు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️