ఆంధ్రా ద్రోహులు మోడీ, చంద్రబాబు, పవన్
విశాఖ : సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సుజాతనగర్ జంక్షన్ లో బ్లాక్ బ్యానర్ తో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బి జగన్ మాట్లాడుతూ విశాఖ సాక్షిగా మోదీ మరోసారి ద్రోహం చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత ముడి ఇనుప గనులు కేటాయింపు, కాపిటల్ రీ స్ట్రచ్చరింగ్ క్రింద రు 18 వేల కోట్లు పై ప్రధాని ప్రకటన చేయక పోవటం విశాఖకు, ఉత్తరాంధ్రకు మరోసారి ద్రోహం చేయడమేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆర్శిలార్ మిట్టల్ స్టీల్ కి అవసరమైన ముడి ఇనుప గనుల సరఫరా, ఇతర అనుమతులు గురించి సాగిల పడి మాట్లాడటం విశాఖ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేయడమేనన్నారు. కేంద్ర బీజేపీ, రాష్ట్ర టిడిపి, జనసేన కూటమి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిట్టల్ కి బలిచ్చేలా కుట్ర పన్నినట్టు ఈ రోజు మోడీ బహిరంగ సభతో తేలిపోయిందన్నారు. దీనికి టీడీపీ, జనసేన కూటమి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆయన ప్రసంగంలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై, విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలైన విద్యుత్ చట్టం కోసం కూడా స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభ, రోడ్ షోలకు తగ్గట్లుగా ప్రజలకు చేసిన మేలు లేదన్నారు. కోట్లు రూపాయలు ప్రజల ధనం వృధా చేశారన్నారు.
విభజన చట్ట ప్రకారం రావలసిన విశాఖ మెట్రో రైల్ మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ది ప్యాకేజీల సంగతి పూర్తిగా మరిచారన్నారు. పక్కనే ఉన్న ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కనీసంగా కూడా అడగలేదని మండిపడ్డారు. సరికదా, ఆయనను పొగడ్తలకి ఇద్దరూ పోటీ పడ్డారని ఆగ్రహించారు. ముచ్చటగా ముగ్గురూ కలిపి ఈ సభా వేదికగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేశారని అన్నారు.