ప్రజాశక్తి- రాజవొమ్మంగి (అల్లూరి జిల్లా) : పొగాకు పంటలో నష్టం రావడంతో మనస్తాపం చెందిన గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… పి.సత్తిబాబు (48) తన రెండు ఎకరాల పొలంలో పొగాకు పంట సాగు చేశారు. పెట్టుబడి కోసం అప్పులు చేశారు. పంట దిగుబడి రాలేదు. అప్పులు తీరేలా లేవని మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు స్థానిక పిహెచ్‌కి తరలించగా వారు ప్రాథమిక వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సత్తిబాబు శనివారం రాత్రి మృతి చెందారు. రాజవొమ్మంగి హెడ్ కానిస్టేబుల్ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత అప్పు ఉన్నదీ దర్యాప్తులో తెలనుందని పోలీసులు తెలిపారు. సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో మంచి పేరు కలిగిన రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
