- హైకోర్టు విస్మయం
- 792 గ్రామాల నుంచి 292 గ్రామాలకు కుదింపు
- ఆ గ్రామాలన్నీ ఎక్కడికిపోయాయని కేంద్రాన్ని నిలదీసిన ధర్మాసనం
ప్రజాశక్తి-అమరావతి : గిరిజనేతరులకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగా ఎప్పటికప్పుడు గిరిజన (షెడ్యూలు 5) ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయనిపక్షంలో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గ్రామాలకు గ్రామాల పరిధులను అధికారులు కుదించడానికి కారణాలు చెప్పాలని ఆదేశించింది. గిరిజనేతరలకు మేలు జరిగేలా గిరిజన గ్రామాల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని, సమగ్ర విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గిరిజన గ్రామాల పరిధులను అధికారులు కుదించేశారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు కుదించేస్తున్నారో, అసలు ఏ అధికారంతో గిరిజన గ్రామాల పరిధిని కుదిస్తున్నారో చెప్పాలని ఆదేశించింది. గతంలో 792 గిరిజన గ్రామాలు ఉండగా, ఆ సంఖ్య అనూహ్యంగా 292 గ్రామాలకు ఎలా తగ్గిపోతుందని విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు 292 గ్రామాలు మాత్రమే ఉంటే మిగిలిన గిరిజన గ్రామాలు ఎక్కడ ఉన్నాయని కేంద్రాన్ని నిలదీసింది. గిరిజన గ్రామాలు ఎలా మాయం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని నిప్పులు చెరిగింది. ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిగ్గదీసింది. గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు గణనీయంగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు టి.వెంకట శివరాం గతంలో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ శ్యామ్‌సుందర్‌రెడ్డి వాదిస్తూ, గిరిజనేతరులకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగంగానే గిరిజన గ్రామాల పరిధిని తగ్గించేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకంగా అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు వీలుగా గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫైకి ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారని తప్పుపట్టారు. గిరిజన ప్రాంతాలను ఆ విధంగా విలీనం చేయడానికి రాజ్యాంగం అనుమతించ దన్నారు. కావాలని అధికారులు గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను తగ్గిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల మేరకు పూర్వం 792 గిరిజన గ్రామాలు ఉండగా, ఆ సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయిందని, ఇప్పుడు అవి కేవలం 292 గ్రామాలే ఉన్నాయని చెప్పారు. గిరిజన గ్రామాల సంఖ్య దారుణంగా తగ్గిపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు, ఈ వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది (డిప్యూటీ సొలిసిటర్ జనరల్) పసల పొన్నారావును ప్రశ్నించింది. వివరాలు ఇవ్వాలని అడిగితే రాష్ట్రం ఇవ్వడం లేదని పొన్నారావు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, దీనిపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించింది.