యాత్రికులకు నివాళి

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : తొక్కిసలాటలో మృతిచెందిన తిరుమల యాత్రికులకు తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ పౌర సంఘాల సమాఖ్య కన్వీనర్‌ టి.సుబ్రమణ్యం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మృతులకు జోహార్లు అర్పిస్తూ, కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రిపబ్లికన్‌ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్‌ రెడ్డి, సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి కే. వేణుగోపాల్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి పి. సాయి లక్ష్మి, సిఐటియు నేతలు జయచంద్ర, మాధవ్‌, ఆర్‌ లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి పాల్గొన్నారు.

➡️