- కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : తెల్లని గంగమ్మ నల్లని యుమన, ఛామనచాయ సరస్వతితో సంగమించి త్రివేణి సంగమం భిన్నత్వంలో ఏకంగా చాటుతోందని కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన శ్రీ శూద్రగంగ ‘కావ్య గాన సభ’లో ఆయన గానాన్ని ఆలపించారు. గంగ, యుమున, సరస్వతిలతో సంగమించిన భారతదేశం ఏకైక మత దేశమని ఉన్మాద పీడకుల కనుపొరలు, చెవిపొరలు తెరిపించిందన్నారు. వర్ణమంటే కులం కాదురా పిచ్చోడా వాతావరణ, భౌగోళిక మేళవింపుతో సంక్రమించిన బంగారు వర్ణమని చాటి చెప్పిందన్నారు. మనుషులంతా మానవీయపు పుడమి మడుగులో బుడగలని, చివరి మాటగా చెప్తూ మనిషి గీసిన దేశ సరిహద్దులను దాటి బంగాళాఖాతంలో ఖాతా తెరిచిందని చెప్పారు. ప్రకృతి సమతుల్యాన్ని వికృతిగా మార్చేయడంతో గంగ ఏవగిస్తూ పరిశుద్ధ గంగలా ప్రవహించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేరని పాలకులను ప్రశ్నిస్తోందన్నారు. పారిశ్రామికవేత్తల డబ్బుల కక్కుర్తికి అలవాటు పడిన పాలకుల ముఖంపై గంగ ప్రశ్నలను ఉమ్మిందన్నారు. పారిశ్రామికులు వదిలే విష రసాయనాలతో తన కంట విషాద వదనం కనిపిస్తోందన్నారు. అన్నదాతల ఆర్తి తీర్చిన తర్వాతే గుడుల్లో తీర్థమవుతానంటూ గంగ భూమిపైకి వచ్చిందన్నారు. తాను శ్రీ భారతీ శూద్ర గంగనని ఒక శాశ్వత సత్య ప్రమాణ వాక్కు పలికిందన్నారు. ఏ దేశంలో శూద్రులు నివసిస్తారో, ఆ దేశంలోనే గంగ ప్రవహిస్తోందటూ తన కావ్యాన్ని ముగించారు. ప్రముఖ కవి, రచయిత అట్టాడ అప్పలనాయుడు కావ్యాన్ని పరిచయం చేశారు. సాహితీ సవ్రంతి కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ అధ్యక్షత వహించిన సభలో కవి కంచరాన భుజంగరావు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ తెలుగు అధ్యాపకులు కె ఉదరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.