ట్రూ అప్‌ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి

  • టిపిఎ, పౌర సంక్షేమ సంఘం రౌండ్‌టేబుల్లో వివిధ సంఘాల తీర్మానం
  • రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు ఐక్యవేదిక కమిటీ ఏర్పాటు

ప్రజాశక్తి – విజయవాడ : విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, ట్రూ ఆప్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ప్రజలకు భారంగా తయారైన స్మార్ట్‌ మీటర్లను పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతూ బుధవారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ట్యాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ (టిపిఎ), పట్టణ పౌరసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో అసోసియేషన్‌ అధ్యక్షులు వి.సాంబిరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యుత్తు శాఖమంత్రి, ఆ శాఖ సిఎండికి విద్యుత్‌ భారాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయాలని సమావేశం నిర్ణయించింది. నవంబరు విద్యుత్‌ బిల్లులతో కలిపి వసూలుకు తలపెట్టిన రూ.6,072.86 కోట్ల సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరించి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో అందుకోసం కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. భారాలను ఉపసంహరించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకుపోతే విశాల ఐక్యత ద్వారా మరో బషీర్‌బాగ్‌ ఉద్యమానికి తెరలేపాల్సి వస్తుందని హెచ్చరించింది. భారాలకు వ్యతిరేకంగా జరగబోయే ఉద్యమాలు, ఆందోళనలకు ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులతో విద్యుత్‌ వినియోగదారుల ఐక్యవేదిక కమిటీ ఏర్పాటైంది. ట్యాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎంవి.ఆంజనేయులును కన్వీనర్‌గా ఏకగ్రీవంగా సమావేశం ఆమోదించింది. ఆంజనేయులు పేరును ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ట్యాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌, పౌరసంక్షేమ సంఘం, నగరంలోని వివిధ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, వర్తక, వాణిజ్య సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లకు చెందిన ప్రతినిధులు, విద్యుత్‌ రంగ నిపుణులు, స్మాల్‌స్కేల్‌ ఇండిస్టీస్‌ అసోసియేషన్‌, ది లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, పోలవరపు ట్రస్ట్‌, ప్రింటర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఫుట్‌వేర్‌ అసోసియేషన్‌, ఎన్‌జి రంగా ట్రస్ట్‌, ఆర్‌టిసి కార్మిక సంఘాల అసోసియేషన్‌, రిటైర్డు విద్యుత్‌ రంగ నిపుణులు, రోటరీ క్లబ్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️