TS Budget : రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా.. రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా తెలిపారు.

  • 2024-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2,75,891కోట్లు
  • పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
  • ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు
  • పంచాయతీ రాజ్‌ రూ. 40,080 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
  • మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
  • వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
  • ఎస్సి సంక్షేమం రూ. 21874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ. 13013 కోట్లు
  • మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1546 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు
  • విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
  • తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు రూ. 500 కోట్లు
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
  • విద్యుత్‌ గృహ జ్యోతికి రూ. 2418 కోట్లు
  • విద్యుత్‌ సంస్థలకు రూ. 16825 కోట్లు
  • నీటి పారుదల శాఖ కు రూ. 28024 కోట్లు

తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు : మంత్రి భట్టి విక్రమార్క

ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ … మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవని ఎద్దేవా చేశారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని విమర్శించారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులితవృద్ధి లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేశామన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. సామాజిక న్యాయం చేసి చూపిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి చూపిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ప్రకటించారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

6 గ్యారంటీల అమలుకు తొలి ప్రాధాన్యత : మంత్రి భట్టి విక్రమార్క

‘ప్రజావాణి’లో రెండు నెలల్లో 43,054 దరఖాస్తులు వచ్చాయని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇళ్ల కోసం వచ్చినవి 14,951 అని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించామన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తామని తెలిపారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. త్వరలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని ప్రకటించారు. దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. పిఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

➡️