TTD: టిటిడిలో కేంద్రం జోక్యం!

Jan 19,2025 00:10 #ttd

భద్రతపై నేడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం పరిశీలన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్బంగా ఈ నెల 8న సంభవించిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నెల 13న అగ్నిప్రమాదం జరిగింది. వెంట వెంటనే జరిగిన రెండు సంఘటనలతో టిటిడిలో భద్రత, పాలనా వైఫల్యాలు ప్రముఖంగా ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో టిటిడిలో భద్రతా లోపాలను పరిశీలించి, తగు సలహాలిచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగింది. ఆ విభాగం అదనపు కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ నేతృత్వంలో బృందం ఈ నెల 19న టిటిడిని సందర్శించనుంది. ఈ మేరకు టిటిడికి కేంద్ర హోంశాఖ నుండి సమాచారం అందింది. కాగా టిటిడిలో వేలు పెట్టేందుకు ఎప్పటి నుంచో మోడీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక లడ్డూ వివాదం తలెత్తిన సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లడ్డూ తయారీలో కల్తీపై విచారణ పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ నియంత్రణలోని సిబిఐ చేతికి వెళ్లింది. ఇప్పుడు టిటిడి భద్రత, పాలనలో జోక్యానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను ప్రయోగిస్తోందన్న విమర్శలు బయలు దేరాయి. కూటమి రాజకీయాల వల్లనే ఇప్పటి వరకు స్వతంత్రంగాన్న ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం టిటిడిలోకి కేంద్రం పరోక్షంగా చొరబడేందుకు అవకాశం ఏర్పడిందని ఆరోపణలొస్తున్నాయి.

➡️