ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని టిటిడి ఇఒ జె శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ మాఢ వీధుల్లో చేసిన ఏర్పాట్లను అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాఢ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. అనంతరం ఆలయ ఇఒ మీడియాతో మాట్లాడుతూ.. రథసప్తమి పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు ఏడు వాహనాలపై స్వామి వారిని తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. ఈ ఉత్సవానికి రెండు నుండి మూడు లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేశామని, మాడ వీధుల్లో ఉన్న యాత్రికులకు రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, ఇన్ ఛార్జ్ సివిఎస్‌ఒ మణికంఠ, జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్ రాజు, ఎఫ్‌ఎ అండ్ సిఎఒ బాలాజీ, సిఇ సత్య నారాయణ అధికారులు పాల్గొన్నారు.
